జనసేన జెండా పీకెయ్యను: పవన్ కళ్యాణ్ అనే కృష్ణుడంటే భయం

  • Publish Date - April 2, 2019 / 02:10 AM IST

ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండాను పీకేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార రోడ్‌షోల్లో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్.. జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం తన భాష మారుతుందని వెల్లడించారు. లెక్కలేసుకుని రాజకీయాల్లోకి  రాలేదని, ప్రజాసేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చినట్లు చెప్పారు. జగన్‌లా అక్రమాస్తుల కేసులు.. చంద్రబాబుపైన ఉన్నట్లు ఓటుకునోటు కేసు తనపై లేవని అన్నారు.

ప్రజలు తన ఫొటో ఇళ్లల్లో పెట్టుకోవాలనే ఆకాంక్షతో ఉన్నట్లు ఎప్పుడూ జగన్ చెబుతుంటారని, రెండేళ్లు జైలుకు వెళ్లిన జగన్‌ ఫొటోను జనాలు ఇళ్లలో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. జకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలని పవన్ హితవు పలికారు. టీడీపీ, వైసీపీ కంసులకు జనసేన పవన్ కళ్యాణ్ అనే కృష్ణుడంటే భయం అని పవన్ అన్నారు.

ఇక తాను సీఎం అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలను ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల నుంచి భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, తాను మాత్రం లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్షమంది యువ రైతులను తయారు చేస్తానని అన్నారు. యువతకు పెద్ద చదువులు అక్కర్లేదని, కష్టపడే తత్వం ఉంటే చాలని అన్నారు. పదో తరగతి పాసైన యువతను స్పెషల్‌ పోలీస్‌ కమాండోలుగా నియమిస్తామని అన్నారు.

జనసేన వచ్చాక పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని, చిన్న, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు పూచీకత్తు లేకుండా రూ.10వేల రుణం ఇస్తామని, ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని వెల్లడించారు.