నువ్వూ మూడు పెళ్లిళ్లు చేసుకో : సీఎం జగన్‌కు పవన్ పంచ్

  • Publish Date - November 12, 2019 / 11:12 AM IST

జగన్ మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు కష్టాలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా తిడతారా? అంటూ విమర్శించారు.

వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. తెలుగుదేశం నాయకులను తిడితే వాళ్లు పడతారేమో కానీ మేము పడం అని అన్నారు పవన్ కళ్యాణ్. వైజాగ్‌లో కూడా ఇదే చెప్పానని అయితే వైసీపీ నాయకుడు జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. 

మీరు ఎంత నీచంగా మాట్లాడినా సంయమనం పాటిస్తున్నామంటే చేతకాక కాదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అబ్ధుల్ కలాం అజాద్ పురస్కారాలు ఇచ్చే ఫంక్షన్‌లో జగన్ నా పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  150మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీని చూసి భయపడుతున్నారు ఎందుకు? అని నిలదీశారు. అంటే మేము బయటకు వస్తే లక్షల మంది వస్తారని భయమా? అని ప్రశ్నించారు.

లాంగ్ మార్చ్‌లో ఈ విషయాన్ని ప్రూవ్ చేశాం అని, అప్పటి నుంచి వైసీపీ భయపడుతుందని అన్నారు పవన్. మాట్లాడితే చాలు మూడు పెళ్లిళ్లు… మూడు పెళ్లిళ్లు అంటూ ఉంటారని, ఎవరొద్దు అన్నారు మీరు కూడా చేసుకోండి అంటూ జగన్‌కు పంచ్ వేశారు జగన్.

కుదరక పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చిందని, సరదా కోసం చేసుకోలేదని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ గారిని ఒక్కటే అడగాలి అనుకుంటున్నా..  నేను చేసుకున్న మూడు పెళ్లిళ్లు కారణంగానే జగన్ గారు రెండేళ్లు జైల్లో ఉన్నారా? నేను చేసుకున్న మూడు పెళ్లిళ్లు వల్లే విజయ్ సాయి రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టారా? అందువల్లే ఇద్దరు జైలుకెళ్లారా? అని నిలదీశారు.