విశాఖ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై
విశాఖ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. సీఎం చంద్రబాబు, జగన్ పై మాటల దాడిని పెంచారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చంద్రబాబు, వైఎస్ఆర్ పేరు చెప్పుకుని జగన్ అధికారంలోకి రావాలని చూస్తున్నారని పవన్ విమర్శించారు. తాను మాత్రం జనం మనం అనే నినాదంతో వచ్చానని చెప్పారు. విశాఖ నార్త్ అక్కయ్యపాలెంలో పవన్ ఎన్నికల ప్రచారం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని పవన్ చెప్పారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు రూ.2వేలు ముఖాన కొట్టారని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల భవిష్యత్ ను దోచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చీఫ్ జగన్ ను కూడా పవన్ వదల్లేదు. దళితులపై జగన్ కపట ప్రేమను చూపిస్తారని ఆరోపించారు. దళితుల పట్ల పులివెందులలో ఎలా వ్యవహరిస్తున్నారో జగన్ వెళ్లి చూడాలన్నారు. జైలు జీవితాన్ని అనుభవించిన జగన్.. అవినీతి గురించి మాట్లాడటం కామెడీగా ఉందన్నారు.
తన పక్కన అవినీతిపరులు లేరని, సీబీఐ మాజీ జేడీ లాంటి నిజాయితీపరులు మాత్రమే ఉన్నారని పవన్ చెప్పారు. చంద్రబాబు పక్కన ఉండేవాళ్లు ఆయన గంట మోగిస్తే భూకబ్జాలు చేస్తారని అన్నారు. ప్రధాని మోడీ ఏపీ ప్రజలను భయపెట్టి పరిపాలించాలని చూస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. అడ్డగోలు రాజకీయాలు చూసి విసుగెత్తిపోయానని అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ వెల్లడించారు.