టెన్షన్.. టెన్షన్: కాకినాడకు పవన్ కళ్యాణ్

  • Publish Date - January 14, 2020 / 01:31 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆరా తీసి పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారు.

పార్టీ విస్తృతస్థాయి సమావేశం మధ్యలో నుంచే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఇవాళ విశాఖకు వచ్చి తర్వాత విశాఖ నుంచి రోడ్డుమార్గంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు వెళ్తారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ టూర్ విశేషాలను వారికి వివరిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడటంతో జనసేన కార్యకర్తలు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి ఇంటి దగ్గర ర్యాలీలు కూడా చేశారు. ఈ క్రమంలో1 ద్వారంపూడి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టడంతో జనసైనికులకు గాయాలయ్యాయి. అయితే పోలీసులు జనసేన నేతలపై కేసులు పెట్టారు.

దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనకి పోలీసులు, అసలైన వైసీపీ నాయకులని వదిలేసి, జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెడితే ఢిల్లీ మీటింగ్ ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము. అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇవాళ కాకినాడలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేదానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.