జనసేనని బీజేపీలో విలీనం చేస్తే స్వాగతిస్తాం: ఎంపీ జీవీఎల్

  • Publish Date - December 5, 2019 / 05:42 AM IST

పవన్ కళ్యాణ్ గారిని మాతో కలిసి పనిచేయమని ఎన్నికలకు ముందే అడగడం జరిగిందని, జనసేనను విలీనం చెయ్యమని అడిగినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు. అయితే అప్పుడు అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని అన్నారు జీవీఎల్. మరి ఇప్పుడు మనస్సు మారి బీజేపీలో విలీనం చేసే ఆలోచన ఉంటే ఆయనను స్వాగతిస్తాం అని అన్నారు జీవీఎల్.

పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అలాగే అనిపిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు జీవీఎల్. జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చెయ్యాలని, నా వంతు స్థాయిలో అందుకు తనను చొరవ తీసుకోమంటే తీసుకుంటానని అన్నారు. అయితే కేవలం రాజకీయ కారణాలతో మా భుజాలపై నుంచి ఆరడుగుల బుల్లెట్ పెట్టి ఎవరినో కాల్చాలని ట్రై చేస్తే మాత్రం కుదరదు అని అన్నారు జీవీఎల్.

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు పెట్టుకునే సంధర్భం అయితే ఇది కాదు అని, ఇంకా ఎన్నికలకు నాలుగేళ్లు ఉన్నాయని, ఇటువంటి సమయంలో పొత్తు ఆలోచన మాత్రం లేదని అన్నారు. విధానాలతో ఏకీభవించి, మా నాయకుడిపై అమిత్ షాపై నమ్మకంతో పార్టీకి సపోర్ట్ చేయవచ్చునని అన్నారు. అవసారానికి వాడుకోవాలంటే మాత్రం గ్రహించలేని పరిస్థితిలో మేము లేమని అన్నారు జీవీఎల్.