ఆదివారం నుండి పెద్దగట్టు జాతర : వాహనాల దారి మళ్లింపు

  • Publish Date - February 24, 2019 / 01:32 PM IST

సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉన్నాడు.  దాదాపు 250 సంవత్సరాలనుంచి ఈ జాతర జరుగుతున్నట్లు  చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఇది భారతదేశంలోని యాదవులకు గల ఏకైక జాతరగా భావిస్తున్నారు. నేటి నుంచి ఐదు రోజులపాటు జాతర జరగుతుంది. 

ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ పెట్టెను ప్రత్యేక పూజలనంతరం తీసుకువచ్చి గుట్టపై ఉన్న లింగమంతులస్వామి, చౌడమ్మ ఆలయాల మధ్య ఉంచుతారు. దేవరపెట్టెలో 36 విగ్రహాలు ఉంటాయి. అనంతరం మెంతబొయిన, మున్న, గోర్ల కుటుంబాలకు చెందినవారు తీసుకువచ్చిన బియ్యంతో వండిన బోనాలను దేవుళ్లకు సమర్పించి, గంపలతో ప్రదక్షిణలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. 

పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై దురాజ్‌పల్లి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే ఈ జాతరను పురస్కరించుకొని ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 65వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు చెప్పారు.  హైదరాబాద్- విజయవాడల మధ్య ప్రయాణించే వాహనాలను మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. అదేవిధంగా జాతర జరిగే రోజుల్లో జాతీయ రహదారిపై  జాతరకు ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర ఒకవైపు భక్తులకు కేటాయిస్తుండగా మరో వైపు ప్రైవేట్ వాహనాలను అనుమతిస్తారు.