డేంజర్ బెల్స్ : పోలవరం దగ్గర మళ్లీ కుంగిన భూమి

  • Publish Date - April 27, 2019 / 08:09 AM IST

పోలవరం ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ భూమి కుంగిపోవడం సర్వసాధారణమై పోయింది. మరోసారి భూమికి పగులు ఏర్పడి కుంగిపోతూ వస్తోంది. పగుళ్లు ఏర్పడ్డాయి. యంత్రాలు భూమిలోకి వెళుతున్నాయి. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేశారు. ప్రమాదం జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే..పోలవరం ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోతోంది. మొదటిసారి భూమి పైకిలేచిన సంగతి తెలిసిందే. మరోసారి స్పిల్ వే దగ్గరున్న భూమి కుంగిపోయింది. త్రివేణి యాజమాన్యం పనులు చేపడుతోంది. ప్రతి కొండకు ఒక పేరు పెట్టారు. 902 కొండ వద్ద త్రివేణి గ్యారేజీ ఉంది. ఏప్రిల్ 27వ తేదీ శనివారం భూమి కుంగిపోతూ వచ్చింది.

కార్మికులు పరుగులు తీశారు. జేసీబీలు, లారీలు, ఇతర భారీ యంత్ర సామాగ్రీ కూడా భూమిలోకి వెళ్లడం గమనించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియచేశారు. యంత్ర సామాగ్రీని సురక్షిత ప్లేస్‌కు తరలిస్తున్నారు. అసలు భూమి ఎందుకు కుంగిపోతుందో ఇంజినీరింగ్ అధికారులకు కూడా తెలియడం లేదు. దీనిపై అధికారులు ఏదో ఒక విషయం మాత్రమే చెబుతూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారే కానీ..ఇలా ఎందుకు అవుతందనే దానిపై అధ్యయనం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.