నిజామాబాద్ లోని ఓ ఈవీఎం అవగాహన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు ఇంకా గుర్తులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను 15 రోజుల పాటు పోస్ట్ పోన్డ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు.
ఈవీఎంలో ఓటు ఏలా వేయాలో తెలుసుకొనేందుకు ఎన్నికల అధికారులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.
ఇందుకు రైతులను కూడా ఆహ్వానించారు. ఏప్రిల్ 03వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు అక్కడకు రైతులు వచ్చారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు గుర్తులు ఎందుకు కేటాయించలేదని వారు అధికారులను నిలదీశారు.
కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతూ ఫంక్షన్ హాల్ ఎదుట బైఠాయించారు. అక్కడనే ఉన్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఎలాంటి ఆందోళనలు చేయవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించడంతో రైతులు ఆందోళన విరమించారు.
గత కొంత కాలంగా పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలుపుతూ అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. దీనిపై ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. పేపర్ కాదు.. మెషిన్‌తోనే అని తేల్చేసింది. M-3 రకం EVMలు వినియోగిస్తామని స్పష్టం చేసింది.
ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు పైన వచ్చేలా కాకుండా.. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పేర్లు వచ్చేలా బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.