తప్పును సరిదిద్దుకుంటే మండలి ఉంటుంది: పోతుల సునీత

  • Publish Date - January 25, 2020 / 04:24 AM IST

తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి రద్దు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆమె.. జగన్‌ను కలిశారు. ఈ సంధర్భంగా.. ఎమ్మెల్సీ పోతుల సునీత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలు విచారకరమని, ప్రజాస్వామ్యాన్ని కొందరు ఎమ్మెల్సీలు అపహాస్యం చేశారని మండిపడ్డారు.

రాజకీయ దోరణితో బిల్లును అడ్డుకుని రాజకీయ అజెండాతో మండలిని దిగజార్చారని అన్నారు. అసెంబ్లీ అనుకునేది ఫైనల్ అని తెలిసి కూడా బిల్లును అడ్డుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు మండలికి వచ్చి గ్యాలరిలో కూర్చుని సైగలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యురాలిగా నిన్న జరిగిన పరిణామాలపై బాధ కలిగిందన్న ఆమె చట్టాలకు విరుద్ధంగా చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

అయితే చేసిన తప్పును సరిదిద్దుకుంటే మండలిని సీఎం జగన్‌ కొనసాగించే అవకాశం ఉందని ఆమె అన్నారు. సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా జాగ్రత్తపడాలని, ఇప్పటికే మండలి గౌరవం దిగజార్చామని ఆమె అన్నారు. ఇకపై ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధికే వికేంద్రీకరణ బిల్లు అన్న ఆమె.. మండలి రద్దు పై సోమవారం స్పష్టత వస్తుందని ఆమె అన్నారు.