రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 55 రాజ్యసభ సీట్లకు మార్చి 26వ తేదీన పోలింగ్ జరగబోతుంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 4సీట్లు, తెలంగాణ నుంచి రెండు సీట్లు కూడా ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మహ్మద్ అలీ ఖాన్, టీ. సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామలక్ష్మి.. తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావుల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఆరు స్థానాల్లో మెజారిటీ ప్రకారం నాలుగు వైసీపీకి, రెండు టీఆర్ఎస్‌కి దక్కనున్నాయి. ఆంధ్ర నుంచి భర్తీ అయ్యే నాలుగు సీట్లలో ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయనకు రాజ్యసభ సీటు ఖరారు అయ్యిందనే ప్రచారం సాగుతుంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసారావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన.
మిగిలిన మూడు సీట్లలో ఒకటి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన తెలుగు దేశం పార్టీ వీడి వైసీపీలోకి వచ్చారు. అప్పుడే ఆయనకు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. శాసనమండలి రద్దు కావడంతో వారి మంత్రి పదవులకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, రాజ్యసభ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కిల్లి కృపారాణి కూడా ఆశావహుల లిస్ట్‌లో ఉన్నారట. కానీ ఆమెకు అవకాశం లేదంటున్నారు.
ఇక నాలుగో సీటు విషయంలో బీజేపీకి ఒకటి ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ ఈ మేరకు వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అది ఎంతవరకు జరుగుతుందో అనేది మాత్రం తెలియలేదు. అలాగే పార్టీలో లేకుండా ఉన్న చిరంజీవి కూడా రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నారని, ఈ మేరకు అతనికి అవకాశం ఇస్తారనే వార్తలు వినిపించాయి.
Read More>>ట్రంప్ ఫోటోలు, ప్లకార్డులతో అమరావతిలో నిరసనలు
దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాల వివరాలు:
రాష్ట్రం | స్థానాలు | పదవీకాలం ముగియనున్న తేదీ |
---|---|---|
మహారాష్ట్ర | 7 | 2020 ఏప్రిల్ 02 |
ఒడిశా | 4 | |
తమిళనాడు | 6 | |
పశ్చిమ బెంగాల్ | 5 | |
ఆంధ్రప్రదేశ్ | 4 | 2020 ఏప్రిల్ 09 |
తెలంగాణ | 2 | |
అస్సాం | 3 | |
బీహార్ | 5 | |
చత్తీస్ ఘడ్ | 2 | |
గుజరాత్ | 4 | |
హర్యానా | 2 | |
హిమాచల్ ప్రదేశ్ | 1 | |
జార్ఖండ్ | 2 | |
మధ్యప్రదేశ్ | 3 | |
మణిపూర్ | 1 | |
రాజస్థాన్ | 3 | 2020 ఏప్రిల్ 12 |
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: మార్చి 6న
నామినేషన్ చివరి తేదీ: మార్చి 13
నామినేషన్ చివరి తేదీ: మార్చి 16
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 18
పోలింగ నిర్వహించే తేదీ: మార్చి 26న
పోలింగ్ సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ: మార్చి 26న సాయంత్రం 5 గంటలకు
మార్చి 30లోగా పోలింగ్ కచ్చితంగా పూర్తి కావాల్సి ఉంది..