రైతు భరోసా ప్రారంభించిన సీఎం జగన్.. రైతులకు చెక్కులు

  • Publish Date - October 15, 2019 / 07:43 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లా కాకుటూరులో పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్ కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ రైతులకు చెక్కులు అందజేశారు.

ఈ రైతు భరోసా పథకానికి రూ.5వేల 510 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 50 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. 3 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరగనుంది.

రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయంను కూడా ప్రభుత్వం రూ.12వేల 500 నుంచి రూ.13వేల 500కు పెంచింది. అంతేకాదు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేయనుంది. ఏటా రూ.13వేల 500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తారు. ప్రతీ సంవత్సరం మేలో రూ.7వేల 500, రబీలో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తామని చెప్పారు.

రైతులు, రైతు ప్రతినిధి సంఘాల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి కురసాల కన్నబాబు. అంతేకాదు ఈ పథకానికి రైతు భరోసా-కిసాన్ సమ్మాన్ యోజన అనే పేరును కూడా మార్చారు. ఈ మొత్తం డబ్బులో రూ.6వేలు కేంద్రం ఇస్తున్న సంగతి తెలిసిందే అందుకే పథకానికి పేరు మార్చారు.