అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 85.92 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మునుపెన్నడు లేని విధంగా ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై జిల్లా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నమోదైన 83 శాతానికి దరిదాపుల్లో ఉంటుందని ఆశించామని…అయితే ఇంత భారీ ఎత్తున ప్రజలు ఓటేస్తారని ఊహించలేదని చెబుతున్నారు.
వాస్తవానికి ప్రకాశం జిల్లాలో భారీగా పోలింగ్ నమోదు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. జిల్లాలో వైసీపీ, టీడీపీ పార్టీలకు గెలుపు జీవన్మరణ సమష్యగా మారడంతో…రెండు పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఓటర్లు ఎక్కడ ఉన్నా..వారిని రప్పించి ఓటు వేయించే విషయంలో బూత్ స్థాయి నాయకులకు బాధ్యత అప్పగించాయి పార్టీలు. దీంతో బూత్ స్థాయి కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను ఓటర్లను రప్పించడంలో సక్సెస్ అవడంతో…రికార్డు స్థాయిలో పోలింగ్ నమదైంది.
హైద్రాబాద్, బెంగులూరు, నల్గొండ, చెన్నె, ముంబై వంటి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు…స్వగ్రామాలకు వచ్చి ఓటు వేశారు. పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో బయట ప్రాంతాల నుంచి ఓటర్లను తమ స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు వచ్చి…స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ రసవరత్తంగా మారడంతో ప్రతి ఒక్క ఓటర్‌ను… పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చేందుకు ఖర్చుకు ఎవరు వెనుకాడలేదు.
దూర ప్రాంతాలపైనే కాకుండా పక్కజిల్లాలో ఉండే ఓటర్లపై కూడా బూత్ స్ధాయి నాయకులు దృష్టి పెట్టి…రప్పించడంలో సక్సెస్ అయ్యారు. కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, నల్లగొండ జిల్లాలకు ఉపాధి కోసం వెళ్లిన ఓటర్లను తీసుకొచ్చి…ఓటు వేయించారు. బస్సులు, ట్రైన్లలో ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసి…ఓటర్లను రప్పించారు ఆయా పార్టీల నేతలు. దీంతో ప్రకాశం జిల్లాలో ఊహించని విధంగా 85శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఫలితాల కోసం మే 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.