రిపబ్లిక్ డే వేడుకలు విశాఖలోనే!

  • Publish Date - January 12, 2020 / 05:03 AM IST

మూడు రాజధానుల నిర్ణయంపై ఓవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం విశాఖకు రాజధాని కార్యకలాపాలు మార్చేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొలుత విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

అయితే రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉద్ధృతమవ్వడంతో విశాఖపట్నంలోనే ఈ వేడుకలు నిర్వహించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. రిపబ్లిక్ డే ఉత్సవాలను విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇది కాగా.. సీఎం హోదాలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తుండేవారు. ఇందిరగాంధీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు చంద్రబాబు. 2018లో మాత్రం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు హాజరయ్యారు.  విశాఖను పరిపాలన రాజధానిగా జనవరి 20వ తేదీ నుంచి ఉపయోగించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. 

ట్రెండింగ్ వార్తలు