10 లక్షలు దాటితే రివర్స్ టెండరింగ్

  • Publish Date - October 10, 2019 / 01:57 AM IST

ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో.. పారదర్శకత, ప్రజాధనం ఆదా కోసం సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 09వ తేదీ బుధవారం క్యాంప్ ఆఫీస్‌లో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 10 లక్షల నుంచి వంద కోట్ల వరకు నిర్వహించే కాంట్రాక్టు టెండర్లలో.. పారదర్శకతకు పెద్దపీట వేసేలా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించారు.

ఈ మేరకు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కనీసం ఐదుగురు గానీ.. బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మంది మాత్రమే రివర్స్‌ టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల.. బిడ్డింగ్‌ ప్రక్రియలో కోట్‌ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని.. రివర్స్‌ టెండరింగ్‌లో మరింత పోటీకి దారి తీస్తుందని సీఎం తెలిపారు. టెండర్లలో ఎక్కువమంది పాల్గొనేలా.. రివర్స్ టెండరింగ్ విధానం ఉండాలన్నారు సీఎం జగన్. తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను.. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సైట్‌లో వారం పాటు డిస్‌ప్లే చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆ తర్వాతే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా కూడా టెండర్లు పిలవాలని సూచించారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సంబంధిత అంశాల సమన్వయం, పర్యవేక్షణ కోసం ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు టెండర్‌ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి.. అక్కడ న్యాయమూర్తికి వివరించాలని సీఎం ఆదేశించారు.

ఈ కొత్త పాలసీ జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలన్నారు సీఎం జగన్. అప్పటివరకు.. ప్రస్తుతమున్న ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ను.. నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సాధ్యమైనంత మేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక.. బిడ్ దక్కించుకున్న వారికి చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలన్నారు సీఎం జగన్.
Read More : సర్వేంద్రియాణాం..నయనం ప్రధానం : YSR కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవం