రైతుల కష్టాలు తీర్చేందుకు ఓ యువకుడు నడుం బిగించాడు. కష్టపడి..చెమటోడ్చి..పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లుకు తీసుకెళ్లేందుకు రైతన్నలు పడుతున్న సమస్యలను తెలుసుకున్నాడు. వాళ్లు మిల్లు దాక వెళ్లడం ఎందుకు ? నేరుగా వారి ఇంటి వద్దకే తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆ యువకుడి మెదిలో మెలిసింది. లక్షలు ఖర్చు పెట్టి రైతన్నల ఇంటి వద్దకే మిల్లు తీసుకొస్తున్నాడు మెట్ పల్లి యువకుడు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మారుతీనగర్‌కు చెందిన జక్క సుభాష్..రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ..ఉపాధి పొందేవాడు. అయితే..వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి రూ. 4.80 లక్షలకు మొబైల్ రైస్ మిల్లింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. డీజిల్‌తో ఈ వాహనం నడుస్తుంది. నేరుగా రైతుల ఇంటి వద్దకు ఈ మెషిన్‌ను తీసుకెళుతున్నాడు.
అక్కడ ధాన్యాన్ని బియ్యంగా మార్చి అందిస్తున్నాడు. గంటకు 15 క్వింటాళ్ల ధాన్యం పడుతుందట. క్వింటాకు 6 కిలోల తవుడు వస్తోంది. 5 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. ఈ మొబైల్ రైస్ మిల్లింగ్ యంత్రంతో నెలకు రూ. 15 వేల చొప్పున ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు.