మృత్యు ఘంటిక : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి 

  • Publish Date - February 7, 2019 / 04:44 AM IST

కర్నూలు : రోడ్డు ప్రమాదల మృత్యు ఘంటికలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో  జిల్లాలోని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం  సంభవించింది. రెండు లారీల మధ్య ఓ తుఫాన్ వాహనం  చిక్కుకుపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన వారిని  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. కడపలో జగన్ సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా గాయపడినవారిలో రాజకీయ నేత కోట్ల హర్షవర్థన్ బంధువులు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న కోట్ల ఘటనాస్థలికి చేరుకుని  పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సనందించాలని డాక్టర్స్ ను కోరారు.