సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేదఘోషతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా భక్తి భావం వెదజల్లుతోంది. కేసీఆర్ చేపట్టిన సహస్ర చండీయాగం 4 రోజుకు చేరుకుంది. జనవరి 24వ తేదీ గురువారం ఎర్రని వస్త్రాలు ధరించిన కేసీఆర్ దంపతులు..వేద పండితులు..రుత్విక్కులు పూజలు నిర్వహించారు. తొలుత రాజశ్యామల మాత మండపంలో తొలి పూజ నిర్వహించారు కేసీఆర్ దంపతులు.
మహారుద్ర మండపంలో జరిగిన పూజల్లో వీరు పాల్గొన్నారు. వీరి సమక్షంలో వేద పండితులు, రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేశారు. నవగ్రహ మండపంలో ఆదిత్య హృదయ పఠనం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. జనవరి 25వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అవుతుంది. యాగం వీక్షించేందుకు పలువురు ప్రముఖులు ఎర్రవల్లికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే లోనికి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. యాగం వీక్షించేందుకు వచ్చిన వారికి యాగ విశిష్టతను వేద పండితులు తెలియచేశారు.