ఏపీలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు: నేడే షెడ్యూల్ విడుదల

  • Publish Date - March 7, 2020 / 02:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ నేడు(07 మార్చి 2020) విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ఓ ప్రకటన చేశారు. విజయవాడలోని ఈసీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం(06 మార్చి 2020) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసారి ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈ మేరకు వీడీయో కాన్ఫరెన్స్‌ నిర్వహించామని తెలిపారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ హేతుబద్ధంగా ఉంటుందని, సింగిల్‌ డెస్క్‌ విధానంతో ఎన్నికల ప్రచారానికి, సభలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, పాత పత్రాలు ఉన్నా కూడా అనుమతులు ఇస్తామని ఈసీ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఓటర్లను, తోటి అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తే అటువంటి అభ్యర్థులపై అనర్హత వేటు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ. ఎన్నికలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎన్నికల సిబ్బంది సరిపోతారని, అవసరమైతే గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా వాడుకుంటామని వెల్లడించారు. అలాగే పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.