ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఒడిశా రాష్ట్రంలో తీరం దాటనుంది.
ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఒడిశా రాష్ట్రంలో తీరం దాటనుంది. 2019, మే 2వ తేదీ ఉదయం 9 గంటల సమయానికి విశాఖపట్టణానికి 270 కిలో మీటర్లు – మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం ఇప్పటికే ఏపీలో కనిపిస్తోంది. వాతావరణం మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. అలలు కూడా 3 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ పరిణామాలతో బీచ్ లు మూసివేశారు. సెక్యూరిటీ పెంచారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయటం లేదు. సముద్రానికి కిలోమీటర్ దూరంలోనే పర్యాటకులను సైతం నిలిపివేస్తున్నారు.
విశాఖపట్టణంలోని RK, బీమిలి బీచ్ ల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. సముద్రం ముందుకొచ్చింది. అలల ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో 24 గంటలు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. విశాఖ నుంచి ఒడిశా, ఇతర ప్రాంతాలకు వెళ్లే 74 రైళ్లను ముందస్తు జాగ్రత్తగా రద్దు చేశారు. గాలుల తీవ్రత, భారీ వర్షాలు పడితే విమాన సర్వీసులను కూడా నిలిపివేయనున్నారు.
విజయనగరం జిల్లా తీర ప్రాంతాల్లోనూ సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.
తీరం దాటే సమయంలో గంటలకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రపై పెను తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Also Read : తెలంగాణపై ఫొని తుఫాన్ ప్రభావం ఉండదు : నేడు మోస్తరు వర్షాలు