ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. గోదావరి ఎగువ, దిగువ ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13.30 లక్షల క్యూసెక్కులు ఉండగా 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా కాల్వకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుమన్నారు.
ధవళేశ్వంరం బ్యారేజి వరద నీటితో కోనసీమలో గోదావరి ఉధృతి పెరిగింది. కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృధ్ధగౌతమి నదులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. ఇక్కడ 16 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పోలాలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు, కోనసీమలోని లంక గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరింది. కూనవరం, ఎటపాక. చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం వద్ద గోదావరి ఉధృతంగా ప్రహిస్తోంది. దేవీ పట్నంమండలంలోని 36 గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. 3 రోజులుగా గ్రామాల్లో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.2 అడుగులుగా నమోదైంది. దీంతో భద్రాచలం వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావరి వరద ఉధృతితో పలు విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీలోని సోకిలేరు, అత్తాకోడళ్ళ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.