చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారో తెలుసా..

  • Publish Date - January 13, 2020 / 07:28 AM IST

మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. భోగి అంటే మంటలు వేసుకోవటం..కొత్త బట్టలు కట్టుకోవటం..సాయంత్రం ఆడబిడ్డలు సందె గొబ్బిళ్లు పెట్టుకుంటారు. అలాగే చిన్నారులకు ‘భోగిపళ్లు’(రేగిపళ్లు) పోస్తారు. భోగిపళ్లు చిన్న పిల్లలకు మాత్రమే పోస్తారు.  దానికి కారణమేంటో తెలుసుకుందాం..

భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్లు పోయడం మన సంప్రదాయాల్లో ఒకటి. నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పండ్లు పోయడంలో మొదటి రహస్యం. 

చిన్నారులకు పోసే భోగిపండ్లల్లో బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపుతారు. వాటిని దోసిళ్లతో తీసుకుని పిల్లల తలపై పోస్తారు. చుట్టూ చేరినవారు భోగిపళ్లను..వాటిలో ఉండే నాణాలను పట్టుకోవటానికి పోటీ పడతారు. దాంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంటుంది. 

రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే.. ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఇది చిన్నారులకు భోగిపళ్లు పోయటంలో మరోరహస్యం అని చెబుతారు పెద్దలు.