సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్.కే. రోజా రాజకీయ రంగప్రవేశం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభం అయ్యింది. సినీరంగంలో అడుగు పెట్టడానికి కారణం అయిన డాక్టర్ శివప్రసాద్ రోజాకు రాజకీయ గురువు అయ్యారు. రోజాను రాజకీయాలలోకి తీసుకు వచ్చింది డాక్టర్ శివప్రసాదే.
చిత్తూరు జిల్లాకు చెందిన శివ ప్రసాద్ నాటకరంగం నుంచి వెండితెరకు వెళ్లారు. నటనతో పాటు తనలోని ప్రతిభకు పదును పెట్టి నాలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.
శివప్రసాద్ దర్శకత్వం మొదటి సినిమాలో రోజాను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశారు. శోభన్ బాబు హీరోగా చేసిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా.. హీరోయిన్‌గా పరిచయమైంది మాత్రం ప్రేమతపస్సు సినిమాతో. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్‌గా నటించింది రోజా.
నారమల్లి శివప్రసాద్, ఆర్కే రోజా ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడంతో మొదట శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. రోజా కూడా అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారి తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారు.