సిక్కోలు టు సీమ ఉద్యమం.. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్ట్‌లు: తమ్మినేని

  • Publish Date - January 10, 2020 / 02:06 AM IST

అమరావతిలో ఉద్యమం చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని అన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాళ్లేం చెయ్యలేరని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనా ఉద్యమ చక్రాల కింద నలిగిపోతారని అన్నారు ఆయన. మా ఉద్యమం ఏంటో మేం చూపిస్తాం.. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఉద్యమం చేస్తామని అన్నారు. విశాఖలో రాజధానిని ఎవరూ ఆపలేరనీ, సీఎం నిర్ణయం కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు.

శ్రీకాకుళంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదిక అనంతరం మీడియాతో మాట్లాడిన తమ్మినేని.. ఏం చంద్రబాబూ తమాషాలు చేస్తున్నావా? మా జిల్లా ప్రజల ఆకలి బాధలు, కడుపు మంట అర్థం కావట్లేదా?! అరెస్ట్‌ చేసేశారని ఇప్పుడు అంటున్నారుగా.. ఏం ఆ రోజు ఎయిర్‌పోర్టులో జగన్‌ని ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? రాజధాని విషయంలో నారావారి కమిటీకి అనుగుణంగానే పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. అసలు విశాఖ రాజధాని కావాలో, వద్దో టీడీపీ నాయకులు స్పష్టం చేయాలని అన్నారు తమ్మినేని.

ఇక ఇదే విషయమై మంత్రి అవంతి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నుంచి మార్చితే విప్లవం వస్తుందంటున్నారు. కానీ, మార్చకపోతేనే వస్తుంది. అమరావతిలో ఉన్నదీ.. ఇతర ప్రాంతాల్లో లేనిదీ ఏమిటో చంద్రబాబు చెప్పాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం చంద్రబాబు వల్లే వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్రం మూడు ముక్కలైతే చంద్రబాబుకు సంతోషంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇదే పంథా కొనసాగితే ఉత్తరాంధ్రలో కూడా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.