తిరుమలో దళారీలను తరిమికొట్టాం : బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి

  • Publish Date - August 26, 2019 / 03:36 PM IST

తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తులకు తక్కువ సమయంలో స్వామివారి దర్శనం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. 10 టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వైవీ సుబ్బారెడ్డి కీలక విషయాలు చెప్పారు.
 
గత ప్రభుత్వం టీటీడీ వ్యవస్దనే భ్రష్టు పట్టించిందని…. ప్రతి దానిలో అవినీతి జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వీఐపీలకు కేటాయించే ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల టిక్కెట్లను పబ్లిక్ గా మార్కెట్లో బ్లాక్ లో అమ్మారని చెప్పారు. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిని నిలుపుదల చేశామన్నారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల వల్ల సామాన్య భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారని.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి వాపోయారు. వాటిని రద్దు చేయటం వల్ల ఇప్పుడు సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన సమయం తగ్గిందని చెప్పుకొచ్చారు. ఎల్ 1,2,3 దర్శనాల రద్దుతో 2 గంటల సమయాన్ని తగ్గించగలిగామని వివరించారు. ఈ 2 గంటల సమయం తగ్గటం వల్ల 10వేల మంది భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారని వివరించారు.

ప్రజా ప్రతినిధులు, వీఐపీ దర్శనానికి అర్హులైన వారికి ఆ కోటాలో దర్శనం కల్పిస్తున్నామని, దళారీ వ్యవస్ధకు తెరతీసిన ఎల్ 1, 2, 3 మాత్రమే రద్దు చేశామని ఆయన తెలిపారు. టీటీడీలో వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను బాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఎంక్వైరీ చేయించి ప్రక్షాళన చేయిస్తున్నానని చెప్పారు. చైర్మన్ ఆఫీసులో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే ఆరోపణలు ఎదుర్కోన్న అదికారిని కూడా మార్చానని సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా టీటీడీ పాలక మండలిని సీఎం జగన్ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.