మంచి ముహూర్తం : ఏపీలో నామినేషన్ల జోరు

  • Publish Date - March 21, 2019 / 03:58 PM IST

ఏపీలో నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. మంచిరోజు కావడంతో మార్చి 21వ తేదీ గురువారం ప్రధాన పార్టీల్లోని హేమాహేమీలు నామినేషన్లు దాఖలు చేశారు. మంచి ముహూర్తం ఉండటంతో మార్చి 22వ తేదీ శుక్రవారం మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో నేతలు స్పీడు పెంచుతున్నారు.

* గాజువాకలో నామినేషన్‌ వేశారు జనసేన అధినేత పవన్‌. మినీ ఆంధ్రప్రదేశైన గాజువాకలో పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గాజువాకకు ఇప్పటివరకు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరూ కూడా ఇక్కడి ప్రజలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. 
* కృష్ణా జిల్లా మైలవరంలో టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రోడ్‌ షో నిర్వహించారు. 
* గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్‌ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ప్రత్తిపాటి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. 
* విశాఖపట్నం ఉత్తరం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. 
* కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్ప రెడ్డి గారి రమేష్ కుమార్ రెడ్డి హంగూ ఆర్బాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ వేశారు. 
* చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ భారీ జనసందోహం మధ్య నామినేషన్‌ దాఖలు చేశారు. 
* కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర భారీ బైక్‌ ర్యాలీతో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. 
* కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయులు స్థానిక ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. 
* కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తరపున ఆయన కుమారుడు వెంకట శివారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 
* గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోమ్మాలపాటి శ్రీధర్ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో  నామినేషన్ దాఖలు చేశారు. 
* జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 
* వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి వైసీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్ధి మల్లాది విష్ణు నామినేషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్ నామినేషన్ దాఖలు చేశారు. సినీ నటుడు ఆలీ.. భరత్‌కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. 
* శ్రీశైలం వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. 
* ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి రెండు సెట్ల నామినేష్ల‌ను దాఖ‌లు చేశారు. 
* గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా విడదల రజని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 
* గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు నామినేషన్ వేశారు. అంతకుముందు స్థానిక రెడ్డి నగర్‌లోని ఆంజనేయస్వామి గుడి నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
* కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్వతంత్ర్య అభ్యర్థి కంఠమనేని రవిశంకర్‌ నామినేషన్‌ వేశారు. మోపిదేవి మండలం రావివారి పాలెం నుంచి అవనిగడ్డ వరకు వేలాది కార్యకర్తల నడుమ పాదయాత్ర నిర్వహించారు. 
* గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు నామినేషన్ వేశారు. ముందు స్థానికరెడ్డి నగర్‌లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో  గెలిపించి .. జగన్‌కి బహుమతిగా అందచేస్తామన్నారు లావు కృష్ణ దేవరాయులు.