ఏం చర్చించారో చెప్పాలి : మోడీతో జగన్ భేటీపై టీడీపీ విమర్శలు

  • Publish Date - October 6, 2019 / 10:16 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక్టోబర్ 06వ తేదీ ఆదివారం యనమల, నక్కా ఆనంద్ బాబులు వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ జరిపిన చర్చల వివరాలను ప్రజలకు తెలియ చేయాలని అన్నారు టీడీపీ నేత యనమల. తమ సమస్యలపై ఏం చర్చించారో తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రజల తలసరి ఆదాయం పడిపోవడానికి సీఎం జగన్ నిర్వాకమే కారణమని ఆరోపించారు. పెట్టుబడి దారులు రావడం లేదని జగన్ ఇచ్చిన వినతిలో ఉందన్న యనమల..భారతమంతా కేంద్రంపై నెట్టివేసి జగన్ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల పనులన్నీ నిలిపివేశారని మండిపడ్డారు. 

నాలుగు సార్లు ప్రధానిని కలిసిన సీఎం జగన్ ఏం సాధించారని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తెస్తానని మాట ఇచ్చి మర్చిపోయారని, కేంద్రాన్ని అడిగే పరిస్థతి లేదని జగన్ చెబుతున్నారని వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. 

మరోవైపు పీఎం నరేంద్ర మోడీని అక్టోబర్ 05వ తేదీ సాయంత్రం సీఎం జగన్ కలిశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. ఏపీలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని, విశాఖ – కాకినాడ పెట్రో అండ్ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని…ఇతరత్రా సమస్యలను కేంద్రం పరిష్కరించాలని కోరారు సీఎం జగన్.