ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ చట్టానికి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దిశ చట్టానికి చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించగా.. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఈ చట్టం గురించి అసెంబ్లీలో మాట్లాడారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సంధర్భంగా ఆమె అన్నారు. ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రవేశ పెట్టిన ‘దిశ’ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.
కానీ సమాజంలో తిరుగుతున్న కొందరు మృగాళ్ల వల్ల ఇలాంటి పెద్దల మాటలన్నీ నీటిమూటలుగానే మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూల చూసినా మహిళలు దాడులకు గురవుతున్నారని తన బాధను వ్యక్తం చేశారు.
అటువంటి నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేయడానికి ఇటువంటి చట్టాలు సాయం చేస్తాయని ఆమె అన్నారు. ఢిల్లీలో నిర్భయ, యూపీలోని ఉన్నావ్ ఘటన, హైదరాబాద్‌లో దిశ వంటి ఘటనలు జరిగినప్పుడూ దేశమంతా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. కానీ అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు అని అన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసి భయానకంగా హత్య చేస్తున్నారని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు గుండె తరుక్కుపోతుందని అన్నారు.
ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే నేరస్థులపై కఠిన చర్యలతో పాటు ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో ముఖ్యంగా మార్పు రావాలని అన్నారు. విద్యా బోధనలో కూడా మహిళల పట్ల గౌరవం, కుటుంబంలో విలువలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, సినిమాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయని, సినిమాలు తీసేటప్పుడు వాటిలో సన్నివేశాలు మహిళల మీద గౌరవం పెంచేవిధంగా ఉండాలని అన్నారు.
సమాజంలో నేరాలు తగ్గాలంటే.. ఇలాంటి చట్టాలు కావాలని, దిశ చట్టాన్ని టీడీపీ స్వాగతిస్తుందని చెప్పిన ఆమె, చట్టాలు చేయడంతోనే సరిపెట్టుకోకుండా అవి చిత్తశుద్ధితో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.