ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై లేటెస్ట్‌గా క్లారిటీ ఇచ్చారు గొట్టిపాటి రవి. టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న రవి వైసీపీలో చేరుతారంటూ కొద్ది కాలంగా ప్రచారం జరిగింది. అయితే శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో దీని పైన అసెంబ్లీ లాబీల్లో స్పందించారు గొట్టిపాటి రవి.
నేను టీడీపీని విడే ప్రసక్తే లేదని అన్నారు గొట్టిపాటి రవి. నా క్వారీల్లో మూడుసార్లు అధికారులు తనిఖీలు నిర్వహించారని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. అసలు తనిఖీల్లో ఏం చేసారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఎంత ఒత్తిడి వచ్చినా తాను పార్టీ మార్పు విషయంలో మాత్రం ఆలోచన లేదని స్పష్టం చేశారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీతో సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ అసెంబ్లీకి రాలేదు. అయితే, అందులో బాలకృష్ణ, పయ్యావుల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పయ్యావుల అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.
ఇక మాజీ మంత్రి మంత్రి గంటా..ఆయన సహచరుడు వాసుపల్లి గణేష్ ఎందుకు సమావేశాలకు రాలేదు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం ఆయన ఇప్పటికే ఖండించారు.