టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా ఖండించారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు సైకిల్ గుర్తుపై గెలిపించారని…టీడీపీలో కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారాయన.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్యలు గెలిచారు. వీరిద్దరూ టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా తాను టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సండ్ర ప్రకటించారు. మాజీ మంత్రి తుమ్మలను మెచ్చా కలవడంతో ఈయన కూడా కారు ఎక్కుతారని జోరుగా ప్రచారం సాగింది. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదని..టీడీపీని వీడే ప్రసక్తి లేదని గతంలో మెచ్చా వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంతటా గులాబీ గాలి వీచినా..ఖమ్మంలో మాత్రం కొంత షాక్ ఇచ్చింది. ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. టీడీపీ నేత నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరి..ఎంపీ అయిన సంగతి తెలిసిందే. మరి మెచ్చా కారు ఎక్కుతారా ? లేదా ? అనేది చూడాలి.