తినింది అరగక దీక్ష చేశానా? ఆ ఎమ్మెల్యేకు సిగ్గుందా?: నారా లోకేష్

  • Publish Date - November 11, 2019 / 02:35 PM IST

ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయిల చప్పున ఆర్థిక సహాయం అందించారు నారా లోకేష్.

ఈ సంధర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, పార్టీ నాయకుల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక లేక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు చనిపోతే వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడమే కాకుండా ఎటకారం చేస్తారా? అంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతి సాక్షిగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే కొట్టుకున్నారు అని.. ఇసుకలో వాటాలు కోసం ఎమ్మెల్యేలే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు నారా లోకేష్. ఎమ్మెల్యేలు కొట్టుకుంటే జగన్ పంచాయితీ చెయ్యలేదా? అని ప్రశ్నించారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇసుక కొరత గురించి సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్. ఇంత పెద్ద సమస్యలు ఉంటే.. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, సీజన్ కాదు అని మంత్రులు అనడం సిగ్గుచేటు అన్నారు. నాయకుల కొడుకులు ఎవరైనా అలా ఆత్మహత్య చేసుకుంటే అలానే చూస్తూ ఊరుకుంటారా? అంటూ నిలదీశారు లోకేష్. ఇదే సమయంలో ఇసుక కోసం దీక్ష చేస్తుంటే, తినింది అరగక దీక్ష చేస్తున్నాను అంటూ ఓ వైసీపీ ఎమ్మెల్యే అన్నారని, అతనికి సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు నారా లోకేష్.