ముఖ్యమంత్రి బాబు సచివాలయంలో రివ్యూలు చేయడంపై వస్తున్న విమర్శలపై TDP MP కనమేడల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రివ్యూ చేస్తారు. రాజనాథ్ సింగ్ రివ్యూలు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్ రాష్టానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసి పాలనకు అడ్డుతగలడం దారుణమని వ్యాఖ్యానించారు. అధికార దాహం తీరలేదని విపక్షము అనడం దారుణమన్నారు. రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వానికి 5 సంవత్సరాల పాటు పాలన చేసే అధికారం ఉంటుందని తెలిపిన ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కోడ్ అమలులో ఉన్నపుడు ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులు మాత్రం ప్రభుత్వ పరిధిలోకి రారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోవాలా ? అని ప్రశ్నించారు. అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలను సకాలంలో అందించాల్సిన అవసరం ప్రభుత్వానిదన్నారు. అందుకే ముఖ్యమంత్రి పాలనను కొనసాగిస్తున్నట్లు తెలిపారు కనకమేడల. అధికారులు కూడా కోడ్ అనే కారణంతో తప్పించుకోకుండా..పాలనను ముందుకు తీసుకు వెళ్ళాలని సూచించారు. ఎన్నికల కమిషన్ పాలనా వ్యవహారాలు కుంటు పడేలా జోక్యం చేసుకోకూడదన్నారు.