ఎన్నికలకు 20 రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించడం లేదు.

  • Publish Date - March 23, 2019 / 02:17 AM IST

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించడం లేదు.

అమరావతి : ఏపీలో ఎన్నికలకు మరో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకు మేనిఫెస్టోను ఎందుకు ప్రకటించడం లేదు. ఒకరు ప్రకటించిన తరువాత మరొకరు ప్రకటించాలనే ఆలోచనతో వేచి చూస్తున్నాయా? ప్రత్యర్ధి కన్నా తమ మేనిఫెస్టో మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతోనే రెండు పార్టీలు ఆలస్యం చేస్తున్నాయా? ఇంతకీ మేనిఫెస్టో ఆలస్యానికి కారణాలేంటి?

మేనిఫెస్టో.. ఓట్ల వర్షం కురిపించే ఓ మంత్రం. మేనిఫెస్టో ఎంత ఆకర్షణగా ఉంటే ప్రజలు అంతగా ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఎన్నికలకు ముందే నుంచే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించి అందులో ఉన్న హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళేలా ప్రచారం చేసుకుంటాయి. అయితే ఈ సారి ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పోలింగ్ సమీపిస్తున్నా ఇంకా మేనిఫెస్టోలను ప్రకటించలేదు. సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ వేయగా, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ నియమించింది.
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య

ఈ రెండు పార్టీలు నియమించిన కమిటీలు తాము రూపొందించిన మేనిఫెస్టోలను పార్టీ అధ్యక్షులకు సమర్పించి కూడా చాలా రోజులయ్యింది. గడచిన వారం రోజుల నుంచి మేనిఫెస్టో ప్రకటించాలని అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీలు సన్నాహాలు చేసుకుంటూనే ఏరోజుకారోజు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాయి. వాస్తవానికి అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ కొత్తగా మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఏమీ లేవు. కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహనరెడ్డి కానీ తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రజలకు చెపుతూనే ఉన్నారు. జగన్మోహనరెడ్డి అయితే నవరత్నాల పేరుతో సంవత్సరంన్నర క్రితమే ప్రజల్లోకి తన పథకాలను తీసుకు వెళ్ళారు. ఇక చంద్రబాబు సైతం తాను అమలు చేయబోయే పథకాలను ఎన్నికలకు మూడు నెలల ముందే అమలు చేయడం కూడా ప్రారంభించేశారు. అయినా అధికారికంగా మేనిఫెస్టోలు ప్రకటించడంలో మాత్రం ఇరు పార్టీలు మీనమేషాలు లెక్కపెడుతున్నాయి.

టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మేనిఫెస్టోలు ఇంతవరకూ ప్రకటించకపోవడానికి కారణం హామీలు ఇవ్వడంలో తమదే పై చేయిగా ఉండాలనే ఉద్దేశమే అని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తే ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు చూసి తరువాత మార్పులూ చేర్పులూ చేసి అవసరమైతే ఒకట్రెండు హామీలు జత చేసి తమ మేనిఫెస్టో విడదల చేయాలని టీడీపీ భావిస్తోంది. వాస్తవానికి మూడు రోజులుగా ప్రతి రోజూ మేనిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమై చివరినిమిషంలో వెనక్కి తగ్గుతోంది టీడీపీ. ఇక వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తోంది.

గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మేనిఫెస్టో విడదల తరువాతే తమ మేనిఫెస్టో ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే తమ నవరత్నాలు ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్ళగలిగామని ఆపార్టీ బలంగా నమ్ముతోంది. ఇక అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో జగన్ రెండేళ్ళుగా చెపుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో తమ మేనిఫెస్టోలో ఒకటో రెండు తురుపుముక్కల్లాంటి హామీలు ఉన్నా వాటిని టీడీపీ కన్నా ముందే బహిరంగ పరిస్తే చంద్రబాబు నాయుడు కూడా తమ మేనిఫెస్టోలో మార్పులు చేసే అవకాశం ఉందనే భావనతో ఆ పార్టీ కూడా మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తోంది.

మొత్తం మీద ఒకరిపై ఒకరు పోటీలు పడి హామీలు ఇస్తున్నా టీడీపీ, వైఎస్ఆర్సీపీలు రెండూ తమ మేనిఫెస్టోలను చాలా గోప్యంగా ఉంచుతున్నాయి. ఒకరు విడుదల చేస్తే మరొకరు విడుదల చేద్దామని ఎదురు చూస్తున్నాయి. ఎవరు ముందుగా మేనిఫెస్టో విడుదల చేస్తారో చూడాలి మరి.
Read Also : పేమెంట్ పెంచ‌గానే రెచ్చిపోతే ఎలా : ప‌వ‌న్ పై విజ‌య‌సాయి సెటైర్లు