క్షుద్రపూజల కలకలం : ఆలయ AEO తో సహా ఐదుగురి అరెస్టు

  • Publish Date - November 27, 2019 / 04:01 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం సమీపంలోని భైరవకోన ఆలయం దగ్గర క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేస్తూ ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ధన్ పాల్ తో పాటు తమిళనాడుకు చెందిన  మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని శ్రీకాళహస్తి రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. గతంలోనూ ఏఈవో ధనపాల్ క్షుద్ర పూజలు చేస్తూ పట్టుబడి సస్పెండ్ అయ్యారు. 

భైరవకోనలోని కాలభైరవ ఆలయం క్షుద్రపూజలకు ప్రసిధ్ది చెందింది. కొన్ని ప్రత్యేక దినాల్లో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ధన్ పాల్ కు తమిళనాడు, కర్ణాటకలో శిష్యులు ఉన్నారు. వారి కోరికలు తీరటం కోసం ఇతను క్షుద్రపూజలు చేస్తూ ఉంటాడని తెలుస్తోంది. 

నవంబర్26, మంగళవారం అమావాస్య కావటంతో, అర్ధరాత్రి సమయంలో ధన్ పాల్ క్షుద్రపూజలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ పూజలు  చేసేందుకు ధన్ పాల్ వారి వద్దనుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూంటాడని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు.