కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. కోడి గుడ్ల టెండర్ల విషయంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో పలువురి తలలు పగిలాయి. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ ప్రాంగణంలో కొన్ని కార్యలయాలు ఉన్నాయి. ఒకరినొకరు తోసుకుంటూ..రాళ్లతో దాడి చేస్తూ..జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పరుగులు తీశారు.
ఒక్కసారిగా హఠాత్ పరిణామానికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కంప్యూటర్ సెక్షన్ ఆఫీసులో పనిచేసే మహిళా ఉద్యోగి కింద పడిపోయినట్లు సమాచారం. గాయాలపాలైన వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాప్రదేశానికి చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేశారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు అక్కడ లేదని తెలుస్తోంది.
Read More : వైయస్ఆర్ ఆదర్శ పథకం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు అవకాశం