పల్నాడు హీట్ : చలో ఆత్మకూరుకు వైసీపీ, టీడీపీ పిలుపు

  • Publish Date - September 10, 2019 / 08:23 AM IST

పల్నాడు చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత టెన్షన్‌ పెరిగింది. రెండు పార్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తల దాడులతో తమ కార్యకర్తలు గ్రామాలను వీడాల్సి వచ్చిందని, వారికి రక్షణ లేదని టీడీపీ వాదిస్తోంది. ఇదంతా టీడీపీ డ్రామా అని వైసీపీ విరుచుకుపడుతోంది.

పలు గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను మోహరించాయి. గుంటూరులోని టీడీపీ పునరావాస కేంద్రంలో ఉన్న వైసీపీ బాధితుల వద్దకు పోలీసులు వచ్చారు. వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆత్మకూరులో పరిస్థితులు కుదురుకున్నాయని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు పోలీసులు తమను గ్రామాల్లో వదిలిపెట్టాక.. మళ్లీ దాడులు చేస్తే కాపాడేదెవరని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమని ఊర్లలో దింపినా స్థానిక పోలీసులు ఊరుకోరని.. వారిపై తమకు నమ్మకం లేదంటున్నారు. ఊర్లో నుంచి గెంటేసిందే పోలీసులని.. వారే ఇప్పుడు ఊర్లలో వదిలిపెడతామంటే ఎలా నమ్మాలంటున్నారు బాధితులు. 

దీనిపై అదనపు ఎస్పీ చక్రవరి రియాక్ట్ అయ్యారు. బాధితుల్ని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని… వాళ్లే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వెల్లడించారు.  గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైతే… పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బలవంతంగా మాత్రం గ్రామాలకు తరలించబోమన్నారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నామన్నారు. స్థానిక పోలీసులు వేధిస్తున్నట్లు ఎవరైనా రాతపూర్వకంగా కంప్లయింట్ చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

మరోవైపు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు… పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. పల్నాడు వ్యవహారంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పల్నాడులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బాధితులున్నారని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని పంపించి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే..పల్నాడు ప్రాంతంలో ఇంకా టెన్షన్..టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాజాగా పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని అచ్చంపేట మండ‌లంలోని గ్రంధ‌శిరిలో ఈ రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కుల మ‌ధ్య ప‌ర‌స్పరం దాడులు జ‌రిగాయి. వైసీపీ వ‌ర్గీయుల దాడిలో టీడీపీ వ‌ర్గీయుల‌కు చెందిన ట్రాక్టర్‌తో పాటు ద్విచ‌క్ర వాహ‌నాలు కూడా ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని స‌త్తెన‌ప‌ల్లి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైసీపీ వ‌ర్గీయులు మార‌ణాయుధాల‌తో త‌మ‌పై దాడి చేశార‌ని టీడీపీ వాళ్లు ఆరోపిస్తుంటే..  వైసీపీ వాళ్ల వెర్షన్ మ‌రోలా ఉంది.
Read More : వైసీపీ MLAకి రేషన్ బియ్యం…అసలేం జరిగిందంటే