బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం అవుతుండడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే నగదు ఎలా డ్రా చేశారని జట్టు పీక్కుంటున్నారు. డెబిట్ కార్డు తమ వద్దే ఉన్నా..డబ్బులు ఎలా పోతున్నాయో అంతుబట్టడం లేదు. ఈ తరహా మోసాలకు అనేక మంది బలవుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో అమరుస్తున్న దొంగ యంత్రాల వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడైంది.
స్కిమ్మర్ అనే పరికరం అమర్చి వీటి ద్వారా డెబిట్ కార్డుల వివరాలను దొంగిలించి నిలువు దోపిడి చేస్తున్నారు. నకిలీ డెబిట్ కార్డులను తయారు చేసి ఆన్ లైన్ నగదు మళ్లింపులు, కొనుగోలుతో సొమ్ములు కాజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడేళ్లలో ఇలాంటి నేరాల్లో సైబర్ నేరగాళ్లు రూ. 223.22 కోట్లు కొల్లగొట్టారని అంచనా.
నగదు తస్కరిస్తారు ఇలా : –
ఏటీఎం కేంద్రాల వద్ద మనకు తెలియకుండా మాటు వేస్తారు. డెబిట్ కార్డు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వారిని టార్గెట్ చేస్తారు. వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తారు.
బాధితుల కార్డులు తీసుకుని మాటల్లో పడేస్తారు. ఈ సమయంలో ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న మాగ్నటిక్ కార్డు రీడర్‌ను పరికరంలో స్వైప్ చేస్తారు.
స్వైప్ చేసిన వెంటనే డెబిట్ కార్డులో ఉన్న వివరాలన్నీ బ్లూ టూత్ ద్వారా వారి మొబైల్‌లో చేరిపోతాయి.
తర్వాత నకిలీ డెబిట్ కార్డులను రూపొందించి సొమ్ములు డ్రా చేస్తుంటారు.
మరో విధానం : –
పెద్దగా జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్ అనే పరికరాన్ని అమరుస్తారు.
కొన్ని రోజుల తర్వాత స్కిమ్మర్ పరికరాన్ని తమతో పాటు తీసుకెళుతారు. పరికరం ఉన్న రోజుల్లో లావాదేవీలు నిర్వహించిన ప్రతి డెబిట్ కార్డు వివరాలు స్కిమ్మర్‌లో నిక్షిప్తమవుతాయి.
తర్వాత నకిలీ డెబిట్ కార్డులను ఉపయోగించి నగదును కొళ్లగొడుతారు.
ఓ అంతర్ రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఒక్క ఏపీలో 47 నేరాలకు పాల్పడిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లోకి వెళ్లి నగదు డ్రా చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రత నిపుణులు సూచిస్తున్నారు.
Read More : శ్రీనివాస గోవిందా : తిరుమల కిటకిట..కన్నుల పండుగగా రథోత్సవం