చిత్తూరు : గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరిటీలు ఎక్కడ ? ఎవరికీ తెలియడం లేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే..ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో విధుల్లో ఉన్న బాలాజీ హరికృష్ణ దీక్షితులు, విజయ సారథి, దేశికాచార్యులు తదితర అర్చకులను పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు చేధించడం కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మూడు రోజుల సిసి ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.
ఈ కేసును ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. గర్భాలయానికి ఎడమవైపున ఉన్న కోదండరామ స్వామి ఉప ఆలయంలోని విగ్రహాల కిరీటాలు మాయమైన సంగతి తెలిసిందే. 528 గ్రాముల బరువు కలిగిన మలయప్ప స్వామి బంగారు కిరీటం, 408 గ్రాముల బరువు కలిగిన శ్రీదేవి అమ్మవారి బంగారు కిరీటం, 415 గ్రాముల బరువు కలిగిన భూదేవి అమ్మవారి బంగారు కిరీటం చోరీకి గురైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనివిలువ రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. గత శనివారం సాయంత్రమే కిరీటాలు చోరీకి గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ దొంగలు ఎవరో పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది.