కిడ్నీ కేటుగాళ్లు : శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు

  • Publish Date - May 13, 2019 / 07:47 AM IST

కిడ్నీ కేటుగాళ్ల భరతం పట్టేందుకు త్రిసభ్య కమిటీ సిద్ధమయ్యింది. దీని వెనుక ఎవరున్నారు ? ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. ఇటీవలే విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వేసినట్లు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్ వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నేతృత్వంలో కిడ్నీ రాకెట్ కేసు విచారణ జరుగుతోంది. అందులో భాగంగా 2019, మే 13వ తేదీ సోమవారం కేజీహెచ్‌లో త్రిసభ్య కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. విచారణలో ఎలా జరపాలి ? ఎవరిని విచారించాలి ? తదితర వాటిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం శ్రద్ధ ఆస్పత్రి వద్దకు సభ్యులు చేరుకున్నారు. 

ఆస్పత్రిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించారు. హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుండి ఎన్ని కిడ్నీ ఆపరేషన్లు చేశారనే దానిపై ఆరా తీసింది. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లతో మాట్లాడారు. కిడ్నీలు ఎలా ఇచ్చారు ? డబ్బుల కోసం చేశారా ? లేక స్వచ్చందంగా ఇచ్చారా అనే దానిపై కూపీ లాగుతున్నారు. కిడ్నీ రాకెట్‌పై వారం రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు కమిటీ సభ్యులు. ఈ ఏడాది 15 ఆపరేషన్లు చేసినట్లు..వెల్లడైంది. ఈ ఆపరేషన్లు నియమ నిబంధనలకు అనుగుణంగా చేశారా ? అనే దానిపై ఆరా తీస్తున్నారు. 

ఐదుగురు నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇద్దరు డాక్టర్స్ ఉండగా..ఒకరు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉన్నారు. కిడ్నీ ఇచ్చిన పార్థసారధిపై కూడా కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డాక్టర్ జేడీ ప్రభాకర్, జేకే వర్మలు కీలక పాత్ర పోషించారని తేలింది. జిల్లా వ్యాప్తంగా ఎన్ని కిడ్నీ ఆపరేషన్లు జరిగాయి ? అవి ఏ ఆస్పత్రిలో జరిగాయి ? అనే దానిపై రెండో దశలో కమిటీ సభ్యులు, పోలీసులు విచారించనున్నారు. 

కూకట్ పల్లికి చెందిన పార్థసారధి సెక్యూర్టీగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతనికి డబ్బు అవసరం పడింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పార్థసారధితో మాట్లాడాడు. కిడ్నీ ఇస్తే రూ. 12 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపించాడు దళారి. కిడ్నీ తీసుకున్న తర్వాత కేవలం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. శ్రద్ధ హాస్పిటల్ ఆస్పత్రి యాజమాన్యం పత్రాలను ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ కిడ్నీ ప్రభాకర్ అనే వ్యక్తికి అమర్చారు. మోసం చేశారంటూ పార్థసారధి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మహరాణిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ 1గా మంజునాథ్, ఏ 2గా పేషెంట్ ప్రభాకర్, ఏ 3గా శ్రద్ధ హాస్పిటల్, ఏ 4గా వెంకటేష్‌లుగా కేసులు నమోదు చేశారు. మంజునాథ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.