వణ్య ప్రాణుల సంరక్షణే ధ్యేయమంటారు. ప్రజలను చైతన్య పర్చడంలో ముందుంటారు. కానీ… ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే… రెండోవైపు చూస్తే గోముఖ వ్యాఘ్రం అనే మాట వీళ్లకి పక్కాగా సెట్ అవుతుంది. పెద్దపులులను సంరక్షిద్దాం అంటూ టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్ఛంద సంస్థ అసలు ముసుగు తొలిగింది. పులులు సంచరించే ప్రాంతాల్లో తిరుగుతూ.. వాటి కదలికలకు సంబంధించిన సమాచారం వేటగాళ్లకు ఇస్తారు. వాటిని హతమార్చేందుకు సహకరిస్తారు. చంపేందుకు కావాల్సిన కిటికులు కూడా చెబుతారు. కుదిరితే చర్మం అమ్ముకోవడం.. లేదంటే వేటగాళ్లను పట్టించి అటవీశాఖ నుంచి నజరానా రూపంలో డబ్బులు అందుకోవడం.. ఇదీ.. టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ అసలు స్వరూపం.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇటీవల పెద్దపులి చర్మం పట్టుబడింది. ఈ కేసు విచారణలో అసలు వెలుగుచూశాయి. టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నందు ఎస్ పింప్లే.. ఎన్జీవో ముసుగులో పెద్దపులుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు రాష్ట్ర పోలీసులు, అటవీశాఖ పరిశోధనలో తేలింది. పింప్లే దాదాపు 71 పులుల హత్యకేసులో ఆయన పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వేటగాళ్లతో నందు పింప్లేకు సత్సంబంధాలున్నాయి. పులి చర్మానికి 20 లక్షల వరకు ధర వస్తుందని వేటగాళ్లకు ఆశ చూపిస్తాడు. వాటి కదలికలకు సంబంధించిన సమాచారం ఇవ్వడమే కాకుండా ఎలా చంపొచ్చో కూడా ప్లాన్ ఇస్తాడు. పులులను చంపాక… అప్పుడే చర్మాన్ని తరలిస్తే దొరికిపోతారని చెప్పి.. వేటగాళ్లను మాయం చేస్తాడు పింప్లే. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి నుంచి రివార్డ్ తీసుకుంటాడు. మందమర్రి పులికేసులోనూ పింప్లే ఇలాగే వ్యవహరించాడు. అయితే… అతని వ్యవహారంపై అనుమానించిన రామగుండం పోలీసులు… తీగలాగితే అసలు డొంక మహారాష్ట్రలో కదిలింది. వేటగాళ్లతోపాటు పింప్లే ముఠాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
జైపూర్ మండలంలో పులుల సంచారంపై సమాచారం సేకరించి.. లోకల్ యానిమల్ ట్రాకర్ల సాయంతో… శివారం గ్రామానికి ఎక్కువగా పులి వస్తుందని గుర్తించాడు. కరెంట్ వైర్లు పెట్టడంలో వేటగాళ్లకు సహకరించాడు. పెద్దపులి చిక్కిన వెంటనే దాన్ని వధించేశారు. ఆ తర్వాత చర్మం కొనేవాళ్లకు సమాచారమిచ్చాడు పింప్లే.. 30 లక్షలకు బేరం పెట్టినా… వ్యవహారం కుదరలేదు. దీంతో.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి… వేటగాళ్లను బోల్తా కొట్టించాడు. వారినుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యాడు.
యానిమల్ ట్రాకర్ల పాత్రపైనా పోలీసులు, అటవీశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిని విధుల నుంచి తప్పించి… నిఘా కెమెరాలు పెట్టేందుకు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. స్వచ్ఛంద సంస్థ ముసుగులు అక్రమాలకు పాల్పడుతున్న నందూ పింప్లే.. అతని అనుచలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలో జరిగిన పులుల వేటకు సంబంధించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు.