ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవాలయంలో మహా ద్వార ప్రవేశ దర్శనంపై ఏపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామిజీలు కూడా దర్శనం చేసుకోవాలని జీవో లో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు మాత్రం మహాద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు అంటే..మార్చి 10వ తేదీ హడావుడిగా బాబు సర్కార్ జీవో (జీవోఎంఎస్ 240 నెంబర్ ) జారీ చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ జీవోను బ్రాహ్మణ సంఘాలు, మత పెద్దలు, అర్చకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది తమను అవమానించడమే అవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి ఆలయ దర్శనానికి నేరుగా మహాద్వారం గుండా ఎవరు వెళ్లవచ్చో జీవోలో పేర్కొంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, ఉప ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జీలు, రాష్ట్ర మంత్రులు, పదవీ విరమణ చేసిన గవర్నర్లు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు రిటైర్డు పర్ధాన న్యాయమూర్తి, రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు గౌరవం కల్పించారు.
ఈ జాబితాలో పీఠాధిపతులు, స్వామిజీలు లేకపోవడాన్ని హిందూ మత పెద్దలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మహాద్వారం గుండా ప్రవేశ అర్హత ఉన్నా వారందరూ ఇప్పుడు ఈ అర్హతను కోల్పోయినట్టేనని అధికారవర్గాలు పేర్కొంటున్నారు. హిందూ ధర్మాన్ని ప్రబోధించే పీఠాధిపతులు, స్వామీజీల పట్ల ప్రభుత్వం అగౌరవం చూపుతుందనడానికి ఇదే నిదర్శమని పలువురు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వాహణ అన్నది ఆగమశాస్త్ర నిబందనల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. మరి బాబు సర్కార్ ఈ జీవోపై వెనుకడుగు వేస్తుందా ? లేదా ? అనేది చూడాలి.