బంగారు కొండలు : వెంకన్న బంగారం 9వేల కేజీలు

  • Publish Date - May 11, 2019 / 10:20 AM IST

ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో మొత్తం 9వేల కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్‌లతో డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇటీవల మూడేళ్ల డిపాటిజ్ స్కీమ్ ముగిసిపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచీ వెనక్కి తెచ్చుకున్న 1,381 కేజీల బంగారంతో కలిపి టీటీడీ ట్రెజరీలో దాదాపు 1,934 కేజీల బంగారం ఉందని అధికారులు తెలిపారు.

ఇటీవల వెనక్కి తెచ్చుకున్న బంగారంను ఎక్కడ డిపాజిట్ చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బోర్డు నిర్ణయం తర్వాత ఆ బంగారాన్ని డిపాజిట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏ బ్యాంకులు ఎక్కువ రిటర్న్ ఇస్తాయో క్యాలిక్యులేట్ చేసుకుని, బోర్డు నిర్ణయం మేరకు డిపాజిట్ చేస్తామని అధికారులు తెలిపారు. 1,381 కేజీల బంగారం కాకుండా ట్రెజరీలో ఉన్న మిగతా 553 కేజీల్లో చిన్న చిన్న నగలు, భక్తులు ఇచ్చిన బంగారు కానుకలు ఉండగా వాటిని కూడా వీటితోపాటే కలిపి డిపాజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా బంగారం నిల్వలపై వివరాలు చెప్పేందుకు టీటీడీ ఇష్టపడదు. కానీ ఇటీవల 1,381 కేజీల గోల్డ్ పై వివాదం చెలరేగడంతో టీటీడీ పూర్తి వివరాలను వెల్లడించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,387 కేజీల బంగారం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1,938 కేజీల బంగారం.. 2015లో రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ మానెటైజేషన్ స్కీమ్ కింద… బంగారాన్ని వివిధ బ్యాంకుల్లో, వివిధ స్కీముల కింద డిపాజిట్ చేసినట్లు తెలిపింది టీటీడీ. టీటీడీ గోల్డ్ డిపాజిట్ల ద్వారా దాదాపు 100 కేజీల బంగారాన్ని వడ్డీ రూపంలో పొందుతుంది.