ఏపీ కేబినెట్ భేటీ : 60 ఏళ్లున్న జర్నలిస్టులకు ఫించన్

  • Publish Date - February 13, 2019 / 01:19 AM IST

విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉదయం జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్ష తేదీని కూడా ఫైనల్‌ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 14వ తేదీ గురువారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం.. అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. 

సీఎం చంద్రబాబు షెడ్యూల్ బీజీగా ఉండటంతో సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీని ఉదయం 8 గంటలకే నిర్వహిస్తున్నారు. బడ్జెట్ అనంతరం తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదం లభించే అవకాశం ఉంది. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛను, మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న వంట ఏజెన్సీల పారితోషకం 1500 నుంచి 3వేలకు పెంపు, 15 సంవత్సరాల అక్రిడేషన్ కలిగి 60 సంవత్సరాలు వయసున్న జర్నలిస్టులకు పింఛను వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే.. పలు సంస్థలకు భూకేటాయింపులు చేయనున్నారు. రైతు పెట్టుబడి సాయానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకంపై కూడా చర్చించనున్నారు. 

ఇక ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష విజయవంతం కావడంతో.. కేంద్రం తీరుపై భవిష్యత్‌లో చేపట్టబోయే పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో తలపెట్టిన చివరి ధర్మపోరాట దీక్షపై నిర్ణయం తీసుకోనున్నారు. స్థలం ఎంపిక, సభను నిర్వహించాల్సిన తేది, సమయం, జాతీయ నాయకుల వెసులుబాటు వీటన్నింటిపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇక త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపి మంత్రి మండలికి ఇదే చివరి సమావేశం కానుంది. దీంతో పలు పెండింగ్‌ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.