నరసరావుపేట బంద్ : కోడెలకు అభిమానుల నివాళులు

  • Publish Date - September 18, 2019 / 04:50 AM IST

ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల మృతికి సంతాపంగా నరసరావుపేటలో స్థానికులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌ను స్వచ్చందంగా వ్యాపారులు మూసివేశారు. కోడెల అంతిమయాత్ర సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కోడెలను చివరిసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కొంతమంది కంటితడి పెట్టుకున్నారు. కోడెలతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. పల్పాడులో ఫ్యాక్షనిస్టు లేకుండా చేశారని, ఆయన వల్ల ఎంతో మంది లబ్ది పొందారని తెలిపారు. నరసరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. 

ఇదిలా ఉంటే..కోడెల అంత్యక్రియలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 700 మందికి పైగా పోలీసులు చేరుకున్నట్లు తెలుస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేశారు. కోడెల నివాసానికి వచ్చే ప్రముఖులుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు రోడ్డులోని స్వర్గపురి వరకు ఉన్న మార్గాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పట్టణ సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఆత్మహత్య అనంతరం పోలీసుల సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఓ కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు పూర్తైన తర్వాత.. కోడెల కుమారుడు శివరాంను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. 
Read More : వైఎస్సార్ కంటి వెలుగు : ఆరు విడతలుగా పరీక్షలు