హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ హావా కొనసాగుతోంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన గులాబీ దళం.. భారీ మెజార్టీతో దూసుకెళ్లటం విశేషం. 16వ రౌండ్ పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 31వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే ఇది అత్యధిక మెజార్టీ రికార్డ్ కావటం మరో విశేషం. గతంలో ఈ నియోజకవర్గంలో 29వేల ఓట్లు మాత్రమే మెజార్టీ ఉంది. ఈ రికార్డ్ ను చరిపేశారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. కొత్త చరిత్ర సృష్టించారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి బరిలో నిలిచారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. రౌండ్ రౌండ్‌లో సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో ఈయన స్వల్ప మెజార్టీతో పరాజయం చెందారు. ఎన్నికల క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా అని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ అలాంటి సీన్ కనిపించలేదు. ఓటర్లు ఏకపక్షంగా కారు వైపు మొగ్గు చూపడంతో నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బీజేపీ, టీడీపీ విషయానికి వస్తే..అంచనాలకు మించి కారు రయ్యి..రయ్యి మంటూ దూసుకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకపోయాయి. టీడీపీ, బీజేపీ పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చెప్పిన బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కుతందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హస్తం పార్టీకి గట్టిపట్టున్న మండలాల్లో సైతం…గులాబీ జెండా రెపరెపలాడింది.
ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హుజూర్ నగర్‌లో ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క అన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానమే చేజారుతుండటం.. హస్తానికి ఆందోళన కలిగిస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే రిజల్ట్స్ వస్తున్నాయి.
Read More : కాంగ్రెస్ కంచుకోట బద్దలు : 21 వేల ఓట్ల ఆధిక్యం..దూసుకుపోతున్న సైదిరెడ్డి