హుజూర్ నగర్‌లో కారు టాప్ గేర్ : సంతోషంగా ఉంది – సైదిరెడ్డి

  • Publish Date - October 24, 2019 / 04:26 AM IST

హుజూర్ నగర్ నియోజకవర్గ వాసులు తమ పార్టీని, సీఎం కేసీఆర్‌ని నమ్మారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు తనకు పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతిపక్షాలు చెప్పిన ఏ మాటలను నమ్మలేదన్నారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. 40 నుంచి 50 వేల మెజార్టీ దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతొక్కరూ తన కోసం పనిచేశారని, వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాల్లో కూడా తాము ఆధిక్యం కనబరుస్తున్నామన్నారు. తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో కౌంటింగ్ చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో సైదిరెడ్డి ఆధిక్యం చూపుతూ వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఏడో రౌండ్‌లో 14 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకపోతున్నారు. నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి మండలాల్లో సైతం టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 22 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఏకపక్షంగా ఫలితాలు వస్తుండడంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. 
Read More : కారుదే జోరు : హుజూర్ నగర్‌లో సైదిరెడ్డి ఆధిక్యం