టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణం విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ సభ్యుడిని నేనంటే నేనంటూ ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితుడైన ప్రముఖుడెవరనే అంశం టీటీడీని ముప్పుతిప్పలు పెడుతోంది.
ముంబైకి చెందిన రాజేష్ శర్మని ప్రభుత్వం టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం అందించారు. ఒకరికి బదులు మరొకరికి సమాచారం అందించారు. అంతేకాదు అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఆయనకు అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని కూడా పంపించేశారు. అయితే తాజాగా ముంబైకు చెందిన రాజేశ్ శర్మ టీటీడీని సంప్రదించడంతో అధికారుల తప్పిదం బయటపడింది.
పరిస్ధితి తెలుసుకున్న ముంబైకి చెందిన రాజేష్ శర్మ జరిగిన పొరపాటును ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇప్పుడు అక్టోబర్ 5న ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారం చేయించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.