ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకంటే ముందు…5.23 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణం అనంతరం శ్రీ వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ వారి ఆలయం ముందున్న బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తలపై స్వామి వారి శేషవస్త్రంతో పరిపట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం గుండా..ఆలయంలో ప్రవేశించి..గర్భాలయంలో మూల విరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.
అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. సోమవారం వాహన మండపం వద్ద పెద్ద శేష వాహనం సేవ జరిగింది. సేవలో పాల్గొన్న సీఎం జగన్..ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. తిరుమల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు.
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8 వరకు జరుగనున్నాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి వివిధ రకాల వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామికి వాహనసేవలు జరగనున్నాయి.
> సెప్టెంబర్ 30న పెద్దశేష వాహనం
> అక్టోబరు 1న చిన్నశేష వాహనం. హంస వాహనం,
> అక్టోబరు 2న సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం
> అక్టోబరు 3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
> అక్టోబరు 4న మోహిని అవతారం, గరుడ వాహనం
> అక్టోబరు 5న హనుమంత వాహనం, గజవాహనం
> అక్టోబరు 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
> అక్టోబరు 7న స్వర్ణ రథం, అశ్వ వాహనం
అక్టోబరు 8న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన గరుడ సేవ అక్టోబరు 4న జరుగనుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై ఉన్న స్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Read More : బాంబులు వేస్తేనే భయపడలేదు..జగన్‌కు భయపడుతానా – బాబు