బ్యాంకుదే బాధ్యత : బంగారం తరలింపుపై టీటీడీ ఈవో సింఘాల్ వివరణ

  • Publish Date - April 22, 2019 / 08:19 AM IST

టీటీడీలో బంగారం తరలింపు తీవ్ర వివాదం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు. కమిటీని నియమించారు. రచ్చ రచ్చ అవుతుండడంతో టీటీడీ ఈవో సింఘాల్ వివరణనిచ్చారు. ఏప్రిల్ 18, 2016లో PNB బ్యాంకులో 1381 కిలోల బంగారం ఉందన్నారు. ఏప్రిల్ 18, 2019 నాటికి మెచ్యూర్టీ అయిందని చెప్పారు. మెచ్యూర్టీ అంశంపై మార్చి 27వ తేదీన పీఎన్‌బీ బ్యాంకుకు లేఖ రాసినట్లు వెల్లడించారు. బంగారం తరలింపు బాధ్యత ఆ బ్యాంకుదేనని స్పష్టం చేశారు.

టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇవ్వడం జరుగుతోందన్నారు. 01-04-2000న గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభమైందని చెప్పిన ఈవీ సింఘాల్.. టీటీడీకీ సంబంధించి మొత్తం 9259 కిలోల బంగారం ఉందన్నారు. SBIలో 5387 కిలోలు, IOB (ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు)లో 1983 కిలోల బంగారం ఉందన్నారు. టీటీడీ ఖజానాలో మరో 553 కిలోల బంగారం ఉందని చెప్పారు. 

1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈనెల 23వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి  శ్రీవారికి చెందిన 1381 కిలోల నగలను చెన్నై నుంచి తిరుపతికి తీసుకొస్తుండగా ఈనెల 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు.

ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో  అటు బ్యాంకు అధికారులు, ఇటు టీటీడీ అధికారులు మేల్కొన్నారు. టీటీడీ నగలకు చెందిన పత్రాలను తమిళనాడు పోలీసులకు చూపించిన నాలుగు రోజుల తర్వాత తిరుపతికి తీసుకొచ్చారు. చీకటిపడ్డాక ఆ నగలను టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకురావడం, కనీస భద్రత లేకుండా తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.