ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గత 5 ఏళ్లలో తిరుపతి బాగా అభివృధ్ది చెందింది. రాష్ట్ర విభజనతో నగరానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రముఖుల తాకిడితోపాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు కేంద్రమైంది. బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లే రహదారులు, యాత్రికులు సంచరించే మార్గాలు ఆధ్యాత్మిక చిత్రాలు, ఆహ్లాదభరిత మొక్కలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలోనే తిరుపతికి గుర్తింపు లభిస్తున్నా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో యాత్రికులు అవస్ధలు పడుతున్నారు.
బస్సులు, విమానాలు, రైళ్లు, సొంత వాహనాలు ద్వారా వచ్చిన భక్తులు తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతికి ప్రతి రోజు దాదాపు 40 వేల వాహనాలు వచ్చి వెళుతుంటాయి. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా సుమారు లక్ష మందిపైగా తిరుమలకు వస్తుంటారు. వీరంతా తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ పెరగడం, రోడ్లన్నీ ఆక్రమణలతో నిండిపోవడంతో నగరంలో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుంది. యాత్రికులే కాక స్థానికంగా ఉన్న ప్రజలుకూడా రోడ్డుపైన సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. తిరుపతి నగర జనాభా 5 లక్షలకు చేరింది. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చటానికి రూపొందించిందే గరుడ వారధి ఫ్లై ఓవర్.
తిరుచానూరు సమీపంలోని శిల్పారామం నుంచి కపిలతీర్థం వద్ద ఉన్న నంది కూడలి వరకు దీన్ని నిర్మించనున్నారు. ఆరుకిలోమీటర్లు మేర 684 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళిక రూపోందించారు. ఇందులో 67 శాతం నిధులను టీటీడీ, 33 శాతం నిధులను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ సమకూరుస్తున్నాయి. వారధితో పాటు స్మార్ట్ సిటీ అభివృధ్ధిలో భాగంగా ప్రతిపాదిత ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే దారిలోని 27 రోడ్ల అభివృధ్దిని, ఆధునీకరణను ఈ ప్రాజెక్టులో చేర్చారు. ప్రతి స్తంభంపై శ్రీవారి శంకు, చక్రాలు కనిపించేలా డిజైన్లు రూపోందించారు.
పనులు ప్రారంభించిన నాటినుంచి 2 ఏళ్లలో ఫ్లై ఓవర్ పూర్తి చేసి,5 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలనే నిబంధనతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆబ్కామ్ సంస్ధకు కాంట్రాక్టు కట్టబెట్టింది. కాగా టీటీడీ బోర్డు బుధవారం తీసుకున్ననిర్ణయంతో ప్రాజెక్టు మరింత ఆలస్యం కానున్నది.