ట్విట్ వార్ : టీడీపీ ఓడిపోతుందన్న మోడీ : నీ మార్పే ఖాయమన్న బాబు

  • Publish Date - April 1, 2019 / 06:53 AM IST

ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ..”ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు.” అంటూ మోడీ ఉదయం ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ వేసిన కొద్దిసేపటికే చంద్రబాబు నరేంద్రమోడీపై విరుచుకుపడుతూ వరుస ట్వీట్లతో నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి నరేంద్ర మోడీ గారు? పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!? అంటూ ఒక ట్వీట్ చేసిన చంద్రబాబు కొనసాగింపుగా.. నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ? ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు. అంటూ ట్వీట్ చేశారు. #ModiIsAMistake అంటూ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్వీట్‌కు జతచేశారు.